కరీంనగర్, సెప్టెంబర్ 7 (చైతన్యగళం):
నగరంలోని ఒకటో డివిజన్ ఆరెపల్లిలో మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఆరెపల్లిలో నూతన సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలు, వాహనదారులకు రాకపోకలు సులభతరం కానున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనులపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బారి అపర్ణ జితేందర్, మున్సిపల్ అధికారులు, కాలనీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
