CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 8:16 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కమాన్‌తో ఆర్టీసీ బస్సులకు ఆటంకం

  • ఇంద్రానగర్‌ కాలనీకి నిలిచిన బస్సుల రాకపోకలు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

బోడుప్పల్‌, సెప్టెంబరు 1 (చైతన్యగళం): బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కమాన్‌ తొలగించకపోవడంతో ఇంద్రానగర్‌ కాలనీకి ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ ముగిసి రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు కమాన్‌ను తొలగించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గత వారం బోనాల పండుగ సందర్భంగా బోడుప్పల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు, నాయకులు భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు, కమాన్లు ఏర్పాటు చేశారు. పండుగ ముగిసిన రెండు, మూడు రోజుల్లోనే జీహెచ్‌ఎంసీ సిబ్బంది హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగించినప్పటికీ ఇంద్రానగర్‌ కాలనీకి వెళ్లే ప్రధాన మార్గంలోని ఓ కమాన్‌ను మాత్రం తొలగించలేదు. దీంతో ఆ మార్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

కమాన్‌ రహదారి మలుపులో ఉండటంతో బస్సులు, ఇతర భారీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా మారిందని ఆర్టీసీ డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో ఇంద్రానగర్‌ కాలనీ బస్టాండ్‌ వరకు వెళ్లకుండా సాయిబాబా గుడి చౌరస్తా వద్దే ప్రయాణికులను దింపి, అక్కడి నుంచే బస్సులు వెనుదిరుగుతున్నాయి. ఫలితంగా కాలనీ వాసులు బస్సుల కోసం అదనపు దూరం నడవాల్సి వస్తోంది.ఆర్టీసీ బస్సులు కాలనీలోకి రాకపోవడంతో ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇతర రవాణా మార్గాలను ఆశ్రయించాల్సి రావడంతో అదనపు ఖర్చు, సమయం వృథా అవుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కమాన్‌ను వెంటనే తొలగించి ఇంద్రానగర్‌ కాలనీ వరకు ఆర్టీసీ బస్సుల రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.