కరీంనగర్ రూరల్, ఆగస్టు 29 (చైతన్యగళం): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎ. నిరంజన్ రెడ్డి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం చిత్యాలపల్లికి చెందిన నడిపెళ్లి మధుసూదన్ రావు ఈ నెల 21న మధ్యాహ్నం తన బెలోనా కారులో శ్రీహరి రావుతో కలిసి కరీంనగర్ వైపు పనిమీద బయలుదేరాడు. తీగలగుట్టపల్లి నుంచి ఆరేపల్లి వెళ్లే రహదారిపై రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను దాటుతున్న సమయంలో మధుసూదన్ రావు కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముందు సీటులో కూర్చున్న బల్మూరి శ్రీహరి రావు (68) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నగునూరులోని ప్రతిమా మెడికల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రీహరి రావు శనివారం ఉదయం సుమారు 10:30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడి కుమారుడు బల్మూరి లక్ష్మీ నరసింహారావు పోలీసులకు సమాచారం అందించడంతో, మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహంపై పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
శ్రీహరి రావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి తెలిపారు.