- రేవంత్ సోదరులపై సంచలన ఆరోపణలు.. పరకాల టికెట్‌పై సవాల్
వరంగల్(చైతన్యగళం): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పరకాల రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే పరకాల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ సంచలన ప్రకటన చేశారు. పరకాల నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పరకాల నియోజకవర్గ రాజకీయాలపై సుష్మితా పటేల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని విమర్శించారు. ‘‘పొంగులేటి ముఖ్యమంత్రా.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రా? అసలు ఎవరు సీఎం అనేది అర్థం కావడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ హామీ నెరవేర్చలేదు
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో తన తండ్రి కొండా మురళి కూడా సహకరించారని సుష్మితా పటేల్ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే సమయంలో కొండా మురళి సహకారం అందించారని తెలిపారు. అందుకు ప్రతిఫలంగా కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.
‘మైసమ్మపై ప్రమాణం చేస్తారా?’
కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని తాను హామీ ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి చెప్పగలరా? అంటూ సుష్మితా పటేల్ సవాల్ చేశారు. ఈ విషయంపై స్థానిక మైసమ్మపై ప్రమాణం చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ‘అచ్చ కాంగ్రెస్’, ‘పచ్చ కాంగ్రెస్’ మధ్య పోటీ నెలకొందని వ్యాఖ్యానించారు.
పరకాల టికెట్‌పై సవాల్
రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పరకాల టికెట్ ఎలా ప్రకటిస్తారని సుష్మితా పటేల్ ప్రశ్నించారు. దమ్ముంటే పదవికి రాజీనామా చేయించి ఇప్పుడే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. తమ ఇలాఖాకు వచ్చి తమతో ఎందుకు పెట్టుకుంటున్నారని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ నిరాకరిస్తే పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.
‘మరిన్ని విషయాలు బయటపెడతా’
రేవంత్‌రెడ్డి సోదరుడికి సంబంధించిన అవినీతి వ్యవహారంలో ఇప్పటివరకు రూ.200 కోట్ల అంశాన్ని మాత్రమే బయటపెట్టానని సుష్మితా పటేల్ ఆరోపించారు. తనపై ఎవరైనా కౌంటర్ ఇస్తే మరిన్ని విషయాలను బయటపెడతానని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల సమయానికి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారో లేదో కూడా చెప్పలేమని వ్యాఖ్యానించారు.
