Wednesday, August 19, 2026
Homeతెలంగాణకొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో కలకలం

కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో కలకలం

📰 Generate e-Paper Clip

  • ‘లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు’.. మల్లు రవి స్పష్టీకరణ
  • పూర్తి వివరాలు తెప్పించుకున్న తర్వాత నిర్ణయం.. అధిష్ఠానం ఆరా

ఢిల్లీ(చైతన్యగళం): మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన లక్ష్మణ రేఖను ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలించిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని మల్లు రవి వెల్లడించారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే విషయంలో క్రమశిక్షణను పాటించాలని సూచించారు.

గతంలోనూ షబ్బీర్‌ అలీ, కొండా మురళి మధ్య వివాదం తలెత్తిన సందర్భంలో ఇరువర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు మల్లు రవి తెలిపారు. ఇటీవల కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నాయకుల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

పీసీసీ చీఫ్‌కు నివేదిక కోరిన ఇన్‌చార్జి

కొండా సుస్మిత వ్యవహారం కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఈ అంశంపై ఆరా తీశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు, వాటి నేపథ్యంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడిని కోరినట్లు సమాచారం.

సుస్మిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య వివాదాలపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించిన నేపథ్యంలో తాజా వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!