Tuesday, August 18, 2026
Homeతెలంగాణటాస్, ఉల్లాస్ లక్ష్యాల సాధనకు శాఖల సమన్వయంతో కృషి

టాస్, ఉల్లాస్ లక్ష్యాల సాధనకు శాఖల సమన్వయంతో కృషి

📰 Generate e-Paper Clip

  • అర్హులందరికీ విద్యావకాశాలు.. నిరక్షరాస్యత నిర్మూలనకు సమష్టి కార్యాచరణ

మహబూబాబాద్‌, ఆగస్టు 18(చైతన్యగళం): జిల్లాలో తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (TOSS), ULLAS–నవ భారత్‌ సాక్షరత కార్యక్రమాల లక్ష్యాలను వందశాతం సాధించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్థానిక ఐడీఓసీ కాన్ఫరెన్స్‌ హాల్లో TOSS, ULLAS కార్యక్రమాల అమలుపై కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, అక్షరాస్యత కార్యక్రమాల అమలులో శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి పురోగతిపై చర్చించారు.

జిల్లా విద్యాశాఖ అధికారి అల్వాల సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పాఠశాల విద్యను మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు, తిరిగి విద్యను కొనసాగించాలనుకునే వారికి TOSS ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యను అభ్యసించే అవకాశాలను విస్తృతంగా కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ అవకాశాలపై అవగాహన కల్పించేలా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.

అదేవిధంగా ULLAS కార్యక్రమం ద్వారా జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యత కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్య అవసరమున్న వారిని గుర్తించి వారికి అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించాలని అన్నారు.

డీఆర్‌డీఓ మధుసూదన్‌ రాజు మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత అవసరమున్న వారిని గుర్తించి ULLASలో చేర్పించేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని అన్నారు.

అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి జిల్లాల డిప్యూటీ డైరెక్టర్‌ తుమ్మ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యను పూర్తి చేయలేకపోయిన వారికి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా తిరిగి విద్యను కొనసాగించే అవకాశం ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ అవకాశంపై అవగాహన కల్పించి, వారిని TOSSలో భాగస్వాములను చేయాలని సూచించారు.

ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్‌ సదానందం మాట్లాడుతూ అర్హులైన వారిని గుర్తించి TOSS, ULLAS కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు అన్ని శాఖలు అవసరమైన సహకారం అందించాలని కోరారు. కార్యక్రమాల లక్ష్య సాధనకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

DWO శ్రీమతి సరిత మాట్లాడుతూ ప్రతి అర్హుడికి విద్యను కొనసాగించే అవకాశం కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం, జీవితాంతం నేర్చుకునే అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని అన్నారు.

క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ

TOSS, ULLAS కార్యక్రమాల లక్ష్యాలను వందశాతం సాధించేందుకు క్షేత్రస్థాయిలో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. అర్హులైన వారి గుర్తింపు, నమోదు, కార్యక్రమాల అమలులో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సమావేశంలో ఏసీజీ మందుల శ్రీరాములు, జిల్లా TOSS అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ శేషుకుమార్‌, MEPD నుంచి విజయ, విద్యాశాఖ నుంచి శ్రీకాంత్‌, DLPOS, స్వప్న, పుల్లారావు, జిల్లాలోని వివిధ సెంటర్ల AI కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!