Monday, August 17, 2026
Homeతెలంగాణఅర్హులందరికీ పింఛన్లు అందిస్తాం

అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం

📰 Generate e-Paper Clip

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

కరీంనగర్‌, ఆగస్టు 15 (చైతన్యగళం): ప్రజలకు రేషన్‌ సరుకులను మరింత పారదర్శకంగా, సులభంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. శనివారం సాయంత్రం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో రేషన్‌ సరుకులు పొందుతున్న లబ్ధిదారులకు ఆయన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్తులో అనేక సంక్షేమ పథకాల అమలుకు ఈ కార్డులు కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. మండలాలు, నియోజకవర్గాల పరిధిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి స్మార్ట్‌ రేషన్‌ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,28,092 రేషన్‌ కార్డులు ఉండగా, వాటి ద్వారా 3,42,57,109 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే మన్నికైన వాటర్‌ప్రూఫ్‌ పీవీసీ కార్డులని చెప్పారు. కార్డుపై ప్రత్యేకంగా యూఆర్‌ కోడ్‌ ఉండటంతో లబ్ధిదారుల వివరాలను సులభంగా గుర్తించడంతో పాటు నకిలీ కార్డులు, డూప్లికేషన్‌, అక్రమ క్లెయిమ్‌లకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, అన్ని వర్గాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేలా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారని పేర్కొన్నారు. పిల్లలకు ఉన్నత విద్య అందితేనే కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని మంత్రి అన్నారు.

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. లబ్ధిదారులు ఈ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేషన్‌ సరుకుల పంపిణీలో అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా సరుకులు పొందేందుకు స్మార్ట్‌ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు.

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందులో భాగంగానే స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ చేపట్టిందని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామగ్రామాన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేష్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తోందన్నారు. పేదలకు రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.

మున్నూరు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి మాట్లాడుతూ ఆహార భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు రేషన్‌ పంపిణీలో అక్రమాలకు తావులేకుండా స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ప్రభుత్వం అందిస్తోందన్నారు. వీటి ద్వారా లబ్ధిదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కరీంనగర్‌ జిల్లాలో 45,290 కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న 2,76,908 కార్డులతో కలిపి జిల్లాలో మొత్తం 3,22,198 రేషన్‌ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి స్మార్ట్‌ రేషన్‌ కార్డు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. రేషన్‌ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

అడిషనల్‌ కలెక్టర్‌ రెవెన్యూ శ్రీనివాస్‌రెడ్డి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పనితీరు, ఉపయోగాలు, వాటి ద్వారా లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు, రేషన్‌ పంపిణీ విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ మహిళలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌ కుట్టుమిషన్లను అందజేశారు.

కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, డీఎస్‌ఓ నర్సింగరావు, డీఎం సివిల్‌ సప్లై రజనీకాంత్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!