కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్య గళం): తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. పంటల మార్పిడితో నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు పెట్టుబడి తగ్గించి అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. శుక్రవారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి 31 వరకు మొక్కజొన్న, ఉలవలు, అలసంద, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు తదితర ఆరుతడి పంటలకు అనుకూల సమయమని తెలిపారు. గత ఏడాది జిల్లాలో 6,130 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు కాగా, ఈ వానాకాలంలో ఇప్పటివరకు 19,135 ఎకరాల్లో సాగు చేయడం అభినందనీయమన్నారు. ఆరుతడి పంటల సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని, ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడిని అలవాటు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 1 నుంచి ఎర్లీ రబీ సీజన్‌లో వేరుశనగ, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేసుకోవచ్చని తెలిపారు. నేల స్వభావం, నీటి లభ్యత, సాగు సమయం, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకుంటూ అధిక ఆదాయం వచ్చే పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
