వరంగల్(చైతన్యగళం): దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా వరంగల్ బ్రాంచ్ కార్యదర్శి ఆవుల యుగంధర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్ రావు, జోనల్ అధ్యక్షుడు శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజనల్ కార్యదర్శి రవీందర్ సంయుక్తంగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
యుగంధర్ యాదవ్ గత 14 సంవత్సరాలుగా మజ్దూర్ యూనియన్‌లో వివిధ హోదాల్లో చురుకుగా పనిచేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే గత ఆరు సంవత్సరాలుగా వరంగల్ బ్రాంచ్ కార్యదర్శిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ, ఉద్యోగుల సంక్షేమం, కార్మిక హక్కుల పరిరక్షణ, రైల్వే ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన యూనియన్ నాయకత్వం జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు అప్పగించింది.
ఈ సందర్భంగా యుగంధర్ యాదవ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన యూనియన్ రాష్ట్ర, జోనల్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
యుగంధర్ యాదవ్ నియామకాన్ని మజ్దూర్ యూనియన్ నాయకులు, రైల్వే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమేష్, వంశీ, కృష్ణ, సురేష్, శ్రీనివాస్, సతీష్, మహేష్, రాకేష్, కనకయ్య, రాజు తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.