Friday, July 31, 2026
Homeతెలంగాణ2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: రేవంత్‌రెడ్డి

2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: రేవంత్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

  • ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యా వ్యవస్థే లక్ష్యం

  • ఫిన్‌లాండ్, జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన ఉపాధ్యాయులతో ఎంసీహెచ్‌ఆర్డీలో ముఖాముఖి

హైదరాబాద్, జులై 30(చైతన్యగళం): రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా విధానాన్ని తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన వ్యాఖ్యానించారు.

డాక్టర్ ఎం.సీ.హెచ్‌ఆర్‌డీలో గురువారం నిర్వహించిన ‘టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌చేంజ్’ కార్యక్రమంలో భాగంగా ఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి తెలంగాణ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విద్యలో నాణ్యత పెరగడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం, మెరుగైన వసతులు అందించాలని సూచించారు.

రెసిడెన్షియల్ పాఠశాలలకు పీవీ శ్రీకారం

జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావు వంటి నేతలు దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని సీఎం పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఆలోచనకు పీవీ నర్సింహారావు శ్రీకారం చుట్టారని తెలిపారు.

సర్వేల్ గురుకుల పాఠశాలలో చదివిన పలువురు విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎదిగారని గుర్తుచేశారు. నవోదయ పాఠశాలలకు స్ఫూర్తి సర్వేల్ గురుకులమేనని పేర్కొన్నారు.

చదువే అభివృద్ధికి మార్గం

వెనుకబాటుతనానికి ప్రధాన కారణం విద్యా లోపమేనని సీఎం అన్నారు. ఆస్తులు ఉన్నా చదువు లేకుంటే సమాజంలో వెనుకబడే పరిస్థితి ఉంటుందని చెప్పారు. చదువుకున్న ఎస్సీ వర్గాల వారు సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని పేర్కొన్నారు.

విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి ఉపాధ్యాయులకు ఉందని కొనియాడారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు.

ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయాలి

ప్రస్తుత విద్యా ప్రమాణాలు ప్రపంచంతో పోటీ పడేందుకు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల విద్యార్థులతో తెలంగాణ విద్యార్థులు పోటీ పడేలా తీర్చిదిద్దాలని సూచించారు.

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వంటి అంశాలను పరిష్కరించామని, ఉపాధ్యాయ సంఘాల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

విద్యా సంస్కరణలతో మార్పు

2014-23 మధ్య కాలంలో పాఠశాలల్లో డ్రాపౌట్లు పెరిగాయని సీఎం పేర్కొన్నారు. 2023-26 మధ్య డ్రాపౌట్లు తగ్గి, విద్యార్థుల చేరికలు పెరిగాయని తెలిపారు. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ఈ మార్పు వచ్చిందన్నారు.

క్రమశిక్షణ లేకుండా ప్రతిభ ఉన్నా ప్రయోజనం ఉండదని సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు క్రమశిక్షణ, విలువలు పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!