కరీంనగర్, జూలై 28 (చైతన్యగళం):కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన అంతర్గత విచారణలో అవినీతి వెలుగులోకి వచ్చింది. మే 19న పద్మనగర్‌కు చెందిన బేతి రాజేందర్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడినప్పటికీ, కోర్టుకు హాజరుకాకుండానే కేసు డిస్పోజ్ అయినట్లు తేలింది. ఈ కేసులో ఆర్ఎస్సై శనిగల శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ సాయి కృష్ణ, డీడీ డిస్పోసల్ స్టేషన్ కానిస్టేబుల్ కిరణ్‌లు నిందితుడి నుండి రూ.15 వేల లంచం తీసుకుని డూప్లికేట్ కేసు నంబర్ నమోదు చేసి అక్రమంగా కేసును ముగించినట్లు ఆధారాలు బయటపడ్డాయి.సీపీ గౌష్ ఆలం నివేదిక ఆధారంగా ముగ్గురిపై డీఐజీ ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. 2025 జనవరి నుండి 2026 జూన్ 30 వరకు నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణ జరుగుతోందని, ఇప్పటివరకు 113 కేసుల్లో డూప్లికేట్ లేదా రిపీటెడ్ ఎస్టీసీ నంబర్లు గుర్తించామని చెప్పారు. వాటిలో 13 కేసుల్లో అవినీతి జరిగినట్లు తేలింది. మూడు కేసుల్లో నిందితులు కోర్టుకు హాజరుకాకుండానే జరిమానా చెల్లించినట్లు చూపించి తప్పుగా డిస్పోజ్ చేశారు. మరో 10 కేసుల్లో కోర్టు విధించిన జరిమానా కంటే అదనంగా రూ.9,700 లంచంగా వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది. మొత్తంగా 14 కేసుల్లో రూ.34,700 మేర అవినీతి జరిగినట్లు తేలిందని, మీడియాలో వస్తున్నట్లు రూ.30 లక్షల అవినీతి జరిగిందనే వార్తల్లో వాస్తవం లేదని సీపీ స్పష్టం చేశారు.సీపీ గౌష్ ఆలం వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారు కోర్టులో హాజరై జరిమానా నేరుగా కోర్టు సిబ్బందికే చెల్లించాలని, రశీదును పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని సూచించారు. ఎవరైనా పోలీసులు అదనపు డబ్బులు డిమాండ్ చేసినా లేదా కోర్టులో హాజరు పరచకుండా కేసులను డిస్పోజ్ చేస్తామని చెప్పినా వెంటనే సీపీ కార్యాలయం లేదా ఏసీబీ కార్యాలయానికి సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
