- వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులకు కాలనీవాసుల వినతి
ఆమనగల్, జూలై 25 (చైతన్యగళం): ఆమనగల్ మున్సిపాలిటీ 13వ వార్డులో జనావాసాలకు ఆనుకుని ఉన్న సర్వే నెం.662/ఆ/2లో లోతట్టు మురికి గుంతలు, భారీ రాళ్లు, కంపచెట్లు ఉండటంతో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని వార్డు కౌన్సిలర్ పుల్లారెడ్డి శ్రీశైలం అనూష ఆధ్వర్యంలో కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. వర్షాకాలంలో మురికి నీరు నిల్వ ఉండటంతో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని, విషసర్పాలు, పందులు సంచరిస్తూ ఇళ్లలోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. చిన్నారులు ఆడుకునే సమయంలో గుంతల్లో పడే ప్రమాదం ఉండటంతో పాటు భారీ వర్షాలకు మట్టి జారి పెద్ద రాళ్లు సమీప ఇళ్లపై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే మురికి గుంతలు పూడ్చివేసి, భారీ రాళ్లు, కంపచెట్లను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని కోరారు. ఈ వినతికి గుజ్జర్ గోపి, చాంద్ పాషా, కుర్షిదా బేగం, మానస, లక్ష్మమ్మ, కళావతి, అమృతమ్మ, జంగమ్మ, గుజ్జరి రాజు, ఆయిలు రాము, యాదగిరి, కృష్ణారెడ్డి చారి, పవన్ తదితర కాలనీవాసులు మద్దతు తెలిపారు.
