కరీంనగర్, జూలై 21 (చైతన్యగళం):
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి బూత్ లెవల్ అధికారి (బీఎల్‌వో) రోజుకు కనీసం 100 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. ఓటరు వివరాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారనే వదంతులను ఖండించాలని, ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్ఛికమేనని స్పష్టం చేశారు. ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఫారం నింపడంలో అవసరమైన సహాయం అందించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 74.01 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో 59.18 శాతం, చొప్పదండిలో 84.11 శాతం, మానకొండూరులో 86.19 శాతం, హుజూరాబాద్‌లో 75.18 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. వచ్చే ఆదివారం నాటికి జిల్లాలో 90 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.
అనంతరం జిల్లా ఎన్నికల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, డిజిటలైజేషన్ పనులను మరింత వేగవంతం చేయాలని, ప్రతి బీఎల్‌వో రోజువారీ లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో జల కుమారి, తహసీల్దార్లు లక్ష్మీనరసింగరావు, రాజేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
