- న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఐతరాజు అభయేందర్ హెచ్చరిక
మర్రిగూడ, జూలై 22 (చైతన్యగళం):
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలోని చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఐతరాజు అభయేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మర్రిగూడ మండల బీఎస్పీ అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలం, యువతకు శాశ్వత ఉపాధి కల్పించాలి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భూములు సేకరించి ఎన్నో సంవత్సరాలు గడిచినా పనులు పూర్తి కాకపోవడం ప్రభుత్వాల వైఫల్యమని, నిర్వాసితులు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూడటం బాధాకరమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజల సమస్యలను విస్మరించి మంత్రి పదవిపైనే దృష్టి పెట్టారని విమర్శించారు.ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ తాగునీటి సమస్య పరిష్కారంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపించారు. “నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బీఎస్పీ పోరాటం ఆగదు, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొట్ట శివ, ఉపాధ్యక్షులు సుక్క రాములు, ఎర్రోళ్ల గిరి, మస్కు ఉదయ్, నాయకులు పల్లేటి రతివ, ఈద నరేష్, సురేష్, విజయ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.
