మహబూబాబాద్(చైతన్యగళం): మహబూబాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు, విద్యార్థులు హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తరగతులను బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. హాస్టళ్లలో తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, మౌలిక వసతులను వెంటనే మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
హాస్టల్‌లో సుమారు 50 మంది విద్యార్థులకు ఒకే బాత్‌రూమ్ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను అధికారులు, ప్రిన్సిపాల్, వార్డెన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కళాశాల ప్రిన్సిపాల్ బలరాంను విద్యార్థినులు ముట్టడించి సమస్యలపై నిలదీశారు.

ఆందోళనలో భాగంగా విద్యార్థులు మూడుకొట్ల సెంటర్‌లో ధర్నా నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థినులతో అసభ్య పదజాలంతో మాట్లాడిన వార్డెన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే వెంటనే సంఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేశారు. హాస్టల్‌లోని సమస్యలను పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనకు PDSU, DSFI, SFI విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
