CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 10:59 am Posted by : rakeshkashaveni12@gmail.com

బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే ధన్‌పాల్

నిజామాబాద్, జూలై 19 (చైతన్య గళం): 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.

నగరంలోని కోటగల్లిలోని కట్ట మైసమ్మ ఆలయం, నాందేవ్‌వాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఆషాఢ మాసం తెలంగాణ ప్రజలకు అత్యంత పవిత్రమైనదని, గ్రామదేవతలను ఆరాధిస్తూ మంచి వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునే పండుగే బోనాలని పేర్కొన్నారు.

బోనాలు తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయని, మహిళలు సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. పోతురాజుల విన్యాసాలు, ఘటం ఊరేగింపులు, రంగం వంటి సంప్రదాయాలు బోనాల వైభవాన్ని మరింత పెంచుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, కోటగల్లి మైసమ్మ ఆలయ ప్రతినిధులు దేవేందర్, గౌడ సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.