Friday, August 28, 2026
Homeసంపాదకీయంస్టీల్ బ్యాంక్‌తో ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్‌కు ఏడాది

స్టీల్ బ్యాంక్‌తో ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్‌కు ఏడాది

📰 Generate e-Paper Clip

  • 276 మహిళా సంఘాల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణలో వినూత్న ఉద్యమం

హుస్నాబాద్, జూలై 17 (చైతన్యగళం):

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన “స్టీల్ బ్యాంక్”కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు స్వంత నిధులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజా ఉద్యమంగా మారిందని మంత్రి తెలిపారు.

గత ఏడాది జూలై 17న తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని 276 గ్రామ మహిళా సమైక్య సంఘాలకు ఉచితంగా స్టీల్ బ్యాంక్ సెట్లు అందించారు. ఒక్కో సెట్‌లో 13 రకాల స్టీల్ పాత్రలు ఉండగా, గ్రామాల అవసరాలకు అనుగుణంగా 300, 400, 500 పాత్రల సామర్థ్యంతో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంతో 7,376 స్వయం సహాయక సంఘాలకు చెందిన 80,633 మంది మహిళలు ప్రత్యక్షంగా లబ్ధి పొందగా, ఇందుకోసం రూ.2.54 కోట్లకు పైగా స్వంత నిధులు వెచ్చించారు.

గ్రామాల్లో వివాహాలు, శుభకార్యాలు, అన్నదానాలు, గ్రామసభల్లో ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా స్టీల్ పాత్రల వినియోగం పెరగడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు గణనీయంగా తగ్గాయని మంత్రి తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని 319 హోటళ్లకు 33,900 స్టీల్ గ్లాసులు ఉచితంగా పంపిణీ చేసి ప్లాస్టిక్ గ్లాసులకు శాశ్వత ప్రత్యామ్నాయం కల్పించినట్లు వివరించారు.

ప్లాస్టిక్ నిర్మూలనతో పాటు మొక్కల నాటకం, చెరువుల అభివృద్ధి, ప్రజా ప్రదేశాల సుందరీకరణ వంటి కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. యెల్లమ్మ చెరువు, పల్లె చెరువు, కొత్త చెరువు, త్రిశూలం జంక్షన్, గాంధీ విగ్రహం పరిసరాలు, “ఐ లవ్ హుస్నాబాద్” ప్రాంతం తదితర ప్రాంతాలు పరిశుభ్రతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు.

అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదని, సమాజంలో శాశ్వత మార్పు తీసుకువచ్చే ఆలోచనలే నిజమైన అభివృద్ధి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, భావితరాలకు పరిశుభ్రమైన, పచ్చని, ఆరోగ్యకరమైన నియోజకవర్గాన్ని అందించేందుకు కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, స్టీల్ బ్యాంక్ కార్యక్రమం గ్రామాల్లో విశేష మార్పు తీసుకువచ్చిందన్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, గ్రామసభలు, అన్నదాన కార్యక్రమాల్లో ఇప్పుడు ఎక్కువగా స్టీల్ పాత్రలనే వినియోగిస్తున్నామని, దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గి గ్రామాలు పరిశుభ్రంగా మారాయని తెలిపారు. స్టీల్ బ్యాంక్ నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని, ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!