Thursday, July 16, 2026
Homeతెలంగాణఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రతపై రాజీ లేదు – ఎంపీ మల్లు రవి

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రతపై రాజీ లేదు – ఎంపీ మల్లు రవి

📰 Generate e-Paper Clip

తెలకపల్లి, జూలై 16 (చైతన్యగళం):
నాగర్‌కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ, “ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రత, సామాజిక న్యాయం విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. బాధితులకు సత్వర న్యాయం, నష్టపరిహారం అందించడంలో జిల్లా యంత్రాంగం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని స్పష్టం చేశారు.

ఆయన పేర్కొంటూ, “ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, హత్యలు, అత్యాచారాలు, వివక్ష ఘటనల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం సహించబోము. ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యతతో విచారించి, బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం, పునరావాసం, సంక్షేమ ప్రయోజనాలు ఆలస్యం లేకుండా అందించాలి” అని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు ఎల్లపోగు వెంకటస్వామి, చిన్నగళ్ల రమేష్, గమ్మకొండ రాములు, వెల్టూరు రేనయ్య, బండ పర్వతాలు, మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమగ్ర సమీక్ష జరిగింది. కేసుల ప్రస్తుత దశ, ఎఫ్‌ఐఆర్ నమోదు, దర్యాప్తు పురోగతి, చార్జిషీట్ దాఖలు, నిందితుల అరెస్టులు, కోర్టు విచారణ, నష్టపరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలపై అధికారులు వివరాలు అందించారు.

ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, “పీసీఆర్ చట్టం, పీవోఏ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. కేసులు నమోదు చేసిన వెంటనే విచారణ వేగవంతం చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ప్రతి కేసు అత్యంత సున్నితమైనది. చట్టపరమైన చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదు” అని హెచ్చరించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. బాధితులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారం, పునరావాసం, ఇతర సదుపాయాలు సకాలంలో అందేలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు.

జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ, “ప్రతి కేసును సున్నితంగా, పారదర్శకంగా విచారిస్తున్నాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటూ బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుంది” అని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, నారాయణరెడ్డి మాట్లాడుతూ, “ఎస్సీ, ఎస్టీల భద్రత విషయంలో రాజీ ఉండదు. కేసుల పురోగతి, నష్టపరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి” అని సూచించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణారెడ్డి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి, కార్మిక శాఖ అధికారి రాజ్‌కుమార్, డీఆర్‌డీఓ చిన్న ఓబులేసు, డిప్యూటీ సీఎంఓ గోపాల్ నాయక్, ఆర్డీవోలు, డీఎస్పీలు, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!