దేవరకొండ, జూలై 15 (చైతన్యగళం): నల్లగొండ జిల్లా డిండి మండలానికి చెందిన యువ అథ్లెట్ నారిమల్ల ప్రవలిక అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడం దేశానికే గర్వకారణమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.చైనాలోని ఓర్డోస్ నగరంలో జూలై 9–12 తేదీల్లో జరిగిన తొలి ఆసియా అండర్‑23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‑2026లో మహిళల 4×400 మీటర్ల రిలేలో ప్రవలిక భారత జట్టుతో కలిసి స్వర్ణ పతకం సాధించారు.ప్రవలిక తండ్రి నారిమల్ల రాంబాబు మేస్త్రీగా, తల్లి విజయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పట్టుదలతో సాధన చేసిన ప్రవలిక నేడు అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి బంగారు పతకం అందించి డిండి గడ్డ కీర్తిని ప్రపంచానికి చాటారు.ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎమ్మెల్యే బాలు నాయక్ రూ.1 లక్ష సహాయం అందించి అండగా నిలిచారు. “మీరు చేసిన సహాయం నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఎప్పటికీ మర్చిపోలేను” అని ప్రవలిక భావోద్వేగంతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, “పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని ప్రవలిక నిరూపించింది. ఆమె విజయంతో దేశానికి, తెలంగాణకు, నల్లగొండ జిల్లాకు గౌరవం వచ్చింది. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశ కీర్తిని ప్రపంచ వేదికపై మరింతగా చాటాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.ప్రవలిక భవిష్యత్తుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని, త్వరలోనే రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.అలాగే ప్రవలికను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కోచ్ పసుపుల పరశురాంను ప్రత్యేకంగా అభినందించారు.ప్రస్తుతం ప్రవలిక నల్లగొండ చర్లపల్లిలోని టీజీఎస్ డబ్ల్యూఆర్డిఎస్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. డిండి గడ్డ నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఎదిగి స్వర్ణ పతకం సాధించిన ప్రవలిక నేటి యువతకు స్ఫూర్తి అని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు.
