కరీంనగర్, జూలై 8 (చైతన్యగళం): కరీంనగర్ నగరాన్ని ఆధునిక, సుందర, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్మార్ట్ సిటీ ప్రత్యేక నిధుల కింద రూ.70 కోట్లతో పలు ప్రతిష్ఠాత్మక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రకటించారు.
ఈ సందర్భంగా నగర అభివృద్ధికి విశేష కృషి చేసి నిధులు మంజూరు చేయించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు నగర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.
నగర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న వరదలు, ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ కొరత, విద్యుత్ వ్యయం, రహదారులు, ప్రజా మౌలిక వసతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని మేయర్ వివరించారు. ఇప్పటికే అన్ని పనులకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (DPRలు) సిద్ధమవుతున్నాయని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులను వేగంగా ప్రారంభిస్తామని తెలిపారు.
ప్రధాన అభివృద్ధి పనుల్లో రామ్‌నగర్, RTC వర్క్‌షాప్, మంచిర్యాల చౌరస్తా వరద నివారణకు ఆధునిక హైడ్రాలిక్ డ్రైనేజీ వ్యవస్థ, టవర్ సర్కిల్‌లో మల్టీ లెవెల్ పార్కింగ్, మున్సిపల్ భవనాలపై సోలార్ ప్యానెల్స్, సదాశివపల్లి జంక్షన్ ఆధునీకరణ, ఎకో-ఫ్రెండ్లీ స్పాంజ్ పార్క్, వల్లంపాహాడ్ మోడల్ వైకుంఠధామం, అల్కాపురి కాలనీలో సీసీ రోడ్లు, జంతు సంక్షేమ కేంద్రం, సెంట్రల్ లైటింగ్ వంటి పనులు ఉన్నాయి.
“ప్రజల అవసరాలే మా ప్రాధాన్యత. నాణ్యతలో రాజీ లేకుండా, పూర్తి పారదర్శకతతో, నిర్ణీత గడువులో పనులను పూర్తి చేసి కరీంనగర్‌ను రాష్ట్రంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం. ఈ అభివృద్ధిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా అందరూ భాగస్వాములు కావాలి” అని మేయర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
