Wednesday, July 8, 2026
Homeతెలంగాణఎఫ్‌సిఐని అదానీ గ్రూప్‌కు అప్పగించడాన్ని నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్

ఎఫ్‌సిఐని అదానీ గ్రూప్‌కు అప్పగించడాన్ని నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్

📰 Generate e-Paper Clip

నల్లగొండ, జూలై 7 (చైతన్యగళం): భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) సైలో పథకాన్ని అదానీ గ్రూప్‌కు అప్పగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.

నల్లగొండలోని సుందరయ్య భవన్లో మంగళవారం జరిగిన ఎఫ్‌సిఐ హమాలి వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) విస్తృత సమావేశంలో వారు మాట్లాడుతూ, “దేశ ఆహార భద్రతా మౌలిక సదుపాయాలను కార్పొరేటీకరించడానికి జరుగుతున్న ప్రమాదకరమైన ప్రయత్నం ఇది” అని విమర్శించారు.

వారి వివరాల ప్రకారం, మొత్తం 134 సైలో కాంట్రాక్టుల్లో 110 కాంట్రాక్టులు అదానీ అగ్రి లాజిస్టిక్స్ లిమిటెడ్, లీప్ ఇండియా ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు రూ.16,500 కోట్లకు దక్కాయి. దీంతో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 46.5 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రెండు సంస్థల ఆధీనంలోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అదానీ గ్రూప్ ధాన్యాగారాలను పంపిణీ కేంద్రాలకు అనుసంధానించేందుకు భారీ ప్రైవేట్ రైల్వే నెట్‌వర్క్ నిర్మిస్తోందని, దీని ద్వారా ధాన్యం సేకరణ, నిల్వ, రవాణా, ఎగుమతి వరకు సరఫరా గొలుసు మొత్తం కార్పొరేట్ నియంత్రణలోకి వెళ్తుందని వారు పేర్కొన్నారు.

సీఐటీయూ నేతలు మాట్లాడుతూ, “రైతుల పోరాటాల వల్ల మూడు వ్యవసాయ చట్టాలు రద్దయినా, ఇప్పుడు ఎఫ్‌సిఐని బలహీనపరుస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టపరమైన హామీ ఇవ్వకుండా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం” అని ఆరోపించారు.

ప్రభుత్వ పెట్టుబడులతో ఎఫ్‌సిఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని, కార్పొరేట్ సంస్థలకు అప్పగించకూడదని వారు డిమాండ్ చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ, మంత్రిత్వ శాఖల పాత్రపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటు చేసి విచారణ జరపాలని కోరారు. కార్మిక వర్గం ఏకమై తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో అవుట రవీందర్, సుంకరబోయిన వెంకన్న, పాలకూరి సైదులు, నరముల రమేష్, రాములు, గణేష్, మేకల రవి, శ్రీనివాస్, ప్రభాకర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!