Monday, September 7, 2026
Homeసంపాదకీయంఅయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

📰 Generate e-Paper Clip

అయోధ్య(చైతన్యగళం): దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల సొమ్మును కొందరు సిబ్బంది పక్కదారి పట్టించిన ఉదంతంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’‌కు సంబంధించిన గత ఐదేళ్ల నాటి ఆర్థిక లావాదేవీల ఖాతాలపై సమగ్రంగా రీ-ఆడిట్‌ నిర్వహించాలని సిట్‌ నిర్ణయించింది. ఆలయ నిర్మాణ వ్యయంతో పాటు దేశ, విదేశాల నుంచి నగదు, బంగారం, వెండి రూపంలో వచ్చిన విరాళాల రికార్డులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కానుకల లెక్కింపు ప్రక్రియలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని నిందితులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో, విరాళాల సేకరణ ప్రారంభమైన నాటి నుంచి జరిగిన ప్రతి లావాదేవీని సిట్ బృందం క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే ఆలయ కాంట్రాక్టు సిబ్బంది, ట్రస్ట్ ముఖ్య బాధ్యుడి వ్యక్తిగత డ్రైవర్‌తో సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లెక్కింపు గదిలోని సీసీటీవీ కెమెరాల నిఘా కంటికి చిక్కకుండా, నగదు కట్టలను తరలించి ఆలయ ప్రాంగణంలోని వాష్‌రూమ్‌లలో దాచిపెట్టేవారమని, ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా బయటకు చేరవేసేవారమని నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ దొంగిలించిన సొమ్ముతో నిందితులు భారీగా ఇళ్లు, స్థలాలు, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామాలు సమర్పించగా, వీటిపై నిర్ణయం తీసుకునేందుకు అయోధ్యలో ట్రస్ట్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

ఈ అక్రమాల నేపథ్యంలో భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల లెక్కింపు విధానంలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టింది. ఇకపై హుండీ కానుకలను లెక్కించే హాలులోకి సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించడమే కాకుండా, వారు ఎలాంటి జేబులు లేని ప్రత్యేకమైన దుస్తులను (పాకెట్‌లెస్ డ్రెస్) ధరించాలని ఆదేశించింది. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేయగా, దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!