ధర్మపురి, జూన్ 22 (చైతన్యగళం): ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.పెగడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 68 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, 9 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. వారికి సేవ చేయడం నా ప్రధాన బాధ్యత. పేద ప్రజల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రతి పేద కుటుంబం కలగంటున్న సొంతింటి స్వప్నాన్ని సాకారం చేయడమే నా లక్ష్యం. అందులో భాగంగా జూలై నెల నాటికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తాం” అని హామీ ఇచ్చారు.అదనంగా, “గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాల కోసం పెగడపల్లి మండలానికి రూ.2.51 కోట్ల నిధులు మంజూరు చేశాం. ఈ నిధులతో గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తాం. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చేసి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. సాగునీటి వసతుల విస్తరణతో పెగడపల్లి మండలాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
