ఆమనగల్లు, జూలై 4 (చైతన్యగళం):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహా విజయోత్సవ కృతజ్ఞత బహిరంగ సభకు ఆమనగల్లు మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శనివారం భారీ సంఖ్యలో తరలివెళ్లారు. సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఉదయం నుంచే పట్టణంలోని అన్ని వార్డుల నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు చేతబట్టి, సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేస్తూ వాహనాల ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వస్పుల మానయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని, ఆ ప్రజాభిమానానికి ప్రతీకగానే కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సభను విజయవంతం చేయడంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల నుంచి మహిళా నాయకులు, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనాల్లో సభకు తరలివెళ్లారు. పార్టీ జెండాలతో, నినాదాలతో సాగిన ర్యాలీ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్, మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, కౌన్సిలర్ అనిత శ్రీనివాస్ రెడ్డి, ఆదివాసి రాష్ట్ర నాయకులు కృష్ణ నాయక్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంగలి ప్రసాద్, నాయకులు అబ్దుల్ అలీమ్, శేఖర్ గౌడ్, రాగ్య నాయక్, సురేష్ నాయక్, శ్రీను నాయక్, నాజర్, దేవరశెట్టి మహేష్, గోపాల్, నిరంజన్, రవి తదితరులు ఉన్నారు.
