పెద్దపల్లి, జూలై 3 (చైతన్యగళం):
జిల్లాలోని నిరుపేద మున్నూరు కాపు కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు జడల సురేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్. రాజయ్య స్పష్టం చేశారు.
గత జూన్ నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల అందుగులపల్లి గ్రామానికి చెందిన కామ వెంకన్న, సుగుణల ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన ఘటనపై సంఘం తక్షణమే స్పందించింది. సభ్యుల సహకారంతో సుమారు 35 వేల రూపాయల విలువైన రేకులు, నగదు సేకరించి బాధితులకు అందజేశారు. ఈ నిధులతో ఇల్లు సరిచేసుకోవడానికి అవసరమైన రేకులు ఇప్పించడంతో పాటు, మిగిలిన 6 వేల రూపాయల నగదును ప్రత్యక్షంగా అందజేశారు.
ఈ సందర్భంగా జడల సురేందర్ మాట్లాడుతూ, “విపత్కర పరిస్థితుల్లో కుల బాంధవులను ఆదుకోవడం మున్నూరు కాపు సంఘం ధ్యేయం. సభ్యులు పెద్ద మనసుతో స్పందించడం అభినందనీయమైనది” అని అన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్. రాజయ్య మాట్లాడుతూ, “సంఘం కేవలం ఈ ఒక్క సహాయానికే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరిస్తుంది. నిరుపేద పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు, వర్షాకాలంలో ఇబ్బందులు పడే నిరాశ్రయులకు ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తాం” అని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా స్థానిక సంఘ పెద్దల ద్వారానే ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అమిరిశెట్టి రామస్వామి, బండారు రామ్మూర్తి, స్వామి వివేక్ పటేల్, జిల్లా నాయకులు పూదరి శ్రీనివాస్, జక్కుల రాజేశం, ఉప్పు రాజ్ కుమార్, అమిరిశెట్టి పూర్ణచందర్, జాపతి రాజేష్, కొట్టే రవి, మల్క విక్రాంత్, జంబు పటేల్, పూదరి కార్తీక్, అందుగులపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు అడువాల మల్లయ్య, గ్రామ శాఖ నాయకులు అడువాల శ్రీను, అడువాల రామన్న, మామిడి అజయ్ తదితరులు పాల్గొన్నారు.
