కేసముద్రం, జూలై 1 (చైతన్యగళం):
మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్‌నగర్ కాలనీ 15వ వార్డుకు చెందిన రామిళ్ల ఉపేంద్ర (48) క్యాన్సర్‌తో మృతిచెందడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో కుటుంబం ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ విషయం స్థానిక కాంగ్రెస్ నాయకులు పోలేపాక నాగరాజు, కౌన్సిలర్ సునీతా భద్రు నాయక్ ద్వారా చిలువేరు సమ్మయ్య గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. వ్యక్తిగతంగా అందుబాటులో లేకపోయినా తన ప్రతినిధుల ద్వారా బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా పోలేపాక నాగరాజు మాట్లాడుతూ, “పేదల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ సమ్మయ్య గౌడ్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సహాయం సమాజానికి ఆదర్శం” అని కొనియాడారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుడు శివారపు శ్రీధర్ కూడా సమ్మయ్య గౌడ్ సేవలను అభినందించారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ సునీతా భద్రు నాయక్, డాక్టర్ ఏకాంతం, అంగోత్ మంగీలాల్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సాయిచరణ్, చంద్రమౌళి, రమేష్, బాలాచారి, అశోక్, విజయ్, యాకబ్రం, సుదర్శన్, వెంకన్న, హనుమంతు తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
