మహబూబాబాద్(చైతన్యగళం): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
జిల్లా క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం, గిరిజనులకు 10% రిజర్వేషన్, గురుకుల విద్యాసంస్థల విస్తరణ, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి అధికారిక నిర్వహణ, సేవాలాల్ భవన్, కొమరం భీమ్ భవన్ నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు కేసీఆర్ హయాంలోనే జరిగాయి” అని గుర్తు చేశారు.
బీజేపీ 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా గిరిజనుల కోసం చేసిన ఒక్క గొప్ప పని ఏమిటో చెప్పాలని ఆమె సవాల్ విసిరారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీని నెరవేర్చకుండా గిరిజన సంక్షేమం గురించి మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని, జీవో–3 అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని మండిపడ్డారు. లంబాడీల ఎస్టీ హక్కుల విషయంలో రాజకీయాలు మానేసి శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
దేశవ్యాప్తంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్రాన్ని కోరుతూ, కేసీఆర్‌పై విమర్శలు చేసే ముందు ఆయన గిరిజనుల కోసం చేసిన సేవలను తెలుసుకోవాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు.
ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ అంగోత్ బిందు, మన్యు ప్యాట్నీ, బొడ శ్రీను నాయక్, అల్లూరి కిషోర్ వర్మ, తుమ్మ వెంకటరెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
