సికింద్రాబాద్ , జూన్ 28 (చైతన్యగళం) : పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు అత్యంత కీలకం అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. పికెట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలియో రహిత భారతదేశమే మన అందరి లక్ష్యమని, దీనిని సాధించాలంటే ప్రతి బిడ్డకూ క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని, ప్రభుత్వం అందిస్తున్న అన్ని టీకాలను తప్పనిసరిగా వేయించాలని పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ పిల్లల ఆరోగ్యం కోసం దగ్గరలోని పోలియో కేంద్రానికి వెళ్లి చుక్కల మందు వేయించాలని,ఇది పూర్తిగా ఉచితం, సురక్షితమని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విశాల్ రాజ్, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
