- అలైన్మెంట్ మార్చాలని బీజేపీ నాయకులు, గ్రామస్థుల రాస్తారోకో
కోహెడ, నవంబర్ 27 (చైతన్యగళం):
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల తెలంగాణ మోడల్ స్కూల్ ప్రాంగణం మధ్య నుంచి రోడ్డు నిర్మించేలా రూపొందించిన అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, గ్రామస్థులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. హుస్నాబాద్–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతిపాదిత అలైన్మెంట్ ప్రకారం రోడ్డు నిర్మిస్తే పాఠశాల ప్రాంగణం రెండుగా విడిపోతుందని, 700 నుంచి 800 మంది విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటస్థలం, విద్యార్థుల భద్రతకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించి సమస్యను పరిష్కరించాలని కోరారు. సుమారు గంటపాటు సాగిన రాస్తారోకోను పోలీసుల విజ్ఞప్తి మేరకు విరమించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం మాట్లాడుతూ.. సర్వే నంబరు 263లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన మోడల్ స్కూల్ ప్రాంగణం మధ్య నుంచి రహదారి నిర్మించడం సమంజసం కాదన్నారు. ఎల్కతుర్తి నుంచి సంగారెడ్డి వరకు నిర్మిస్తున్న ప్రధాన రహదారి అలైన్‌మెంట్‌ను నాగసముద్రాల పాఠశాల వద్ద మాత్రమే ఎస్ ఆకారంలో రూపొందించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటికే మూడుసార్లు సర్వే నిర్వహించినప్పటికీ విద్యార్థులకు నష్టం కలిగించేలా అలైన్మెంట్ రూపొందించడంపై అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పాఠశాల ఖాతాలో నష్టపరిహారం కింద రూ.62 లక్షలు జమ అయినట్లు తెలుస్తోందని, ఈ విషయం పేరెంట్స్ కమిటీ, గ్రామస్థులకు తెలియకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిధుల మంజూరు, వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. పీఎం శ్రీ పథకం కింద మంజూరైన సుమారు రూ.2 కోట్ల నిధుల వినియోగంపై వచ్చిన ఆరోపణలను కూడా పరిశీలించాలని అన్నారు. రోడ్డు పనులను తక్షణమే నిలిపివేసి, పాఠశాలకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గంలో అలైన్మెంట్ రూపొందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా గ్రామస్థులు, తల్లిదండ్రులు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మోడల్ స్కూల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన గ్రామానికి చెందిన న్యాయవాది యాళ్ళ శ్రీనివాస్‌రెడ్డి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సూదగోని లక్ష్మి, మధుగౌడ్ నిరసనకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్, పేర్యాల సాగర్‌రావు, పిల్లి నర్సయ్య, మ్యాకాల రజినీకాంత్‌రెడ్డి, సామల గిరిధర్, దావా శేఖర్, జోగు చంద్రమౌళి, బొమ్మగాని రంజిత్, కంది సత్యనారాయణరెడ్డి, నాగు అజయ్, అన్నాడి లక్ష్మారెడ్డి, పొన్నాల శంకర్, బాణోత్ సురేష్‌నాయక్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నాగసముద్రాల, బత్తులవానిపల్లి, లక్ష్మీపూర్, సముద్రాల, అరెపల్లి, బస్వాపూర్ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నిరసనకు మద్దతు తెలిపారు.

