- మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో చారిత్రక ప్రాంతానికి మహర్దశ
హుస్నాబాద్, నవంబర్ 21 (చైతన్యగళం): హుస్నాబాద్ సమీపంలోని మొహమ్మదాపూర్ గ్రామంలో తెలంగాణ భగత్‌సింగ్‌గా పేరుగాంచిన అనభేరి ప్రభాకర్‌రావు స్మారక పార్క్ అభివృద్ధితో పాటు మెమోరియల్ హాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.30 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్న రాజు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు కావడం హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి, చారిత్రక వారసత్వ పరిరక్షణకు కీలక ముందడుగు అని పేర్కొన్నారు.
తెలంగాణ పోరాట చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన అనభేరి ప్రభాకర్‌రావు స్మారక ప్రదేశాన్ని అభివృద్ధి చేసి, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. మొహమ్మదాపూర్ గ్రామంలోని మైసమ్మ ఆలయానికి దసరా సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, ఈ నేపథ్యంలో స్మారక పార్క్ అభివృద్ధితో పాటు మెమోరియల్ హాల్ నిర్మాణం చేపట్టి భక్తులకు, పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
స్మారక పార్క్, హాల్ దెబ్బతిన్న స్థితిలో ఉండటాన్ని గుర్తించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అభివృద్ధి పనులకు రూ.2.30 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారని వెన్న రాజు వివరించారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం స్మారక పార్క్ అభివృద్ధి, మెమోరియల్ హాల్ నిర్మాణ పనులకు రూ.2,30,00,000 నిధులతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందన్నారు.
ఈ నిధులతో స్మారక పార్క్ పునరుద్ధరణ, మెమోరియల్ హాల్ నిర్మాణం, పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే మొహమ్మదాపూర్ స్మారక ప్రదేశం మరింత ఆకర్షణీయంగా మారడంతో పాటు అనభేరి ప్రభాకర్‌రావు చరిత్ర, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసే కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ ప్రాంతానికి పర్యాటకంగానూ మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు చారిత్రక ప్రదేశాల పరిరక్షణ, పర్యాటక రంగ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని వెన్న రాజు తెలిపారు. అనభేరి ప్రభాకర్‌రావు స్మారక పార్క్ అభివృద్ధి, మెమోరియల్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

