- పూల పండుగతో మహిళల ఐక్యత, ఆత్మీయత వెల్లివిరుస్తాయి: మాజీ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్
కోహెడ, అక్టోబర్ 18 (చైతన్యగళం):
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోహెడ మండల మాజీ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ తోటి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొక్కుల కీర్తి సురేష్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ప్రకృతిని ఆరాధించడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. అక్కాచెల్లెళ్ల ఆత్మీయతకు, ఆడపడుచుల ఐక్యతకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ వేడుకలకు సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగింపు పలుకుతామని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నా బతుకమ్మ పండుగను మరిచిపోకుండా జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమన్నారు. మన పండుగలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
అనంతరం బస్వాపూర్ గ్రామ ప్రజలకు, కోహెడ మండల ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
