- 150 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ
- వైద్య సేవలపై గ్రామస్తుల హర్షం
కందుకూరు, అక్టోబర్ 15 (చైతన్యగళం): రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం జైత్వారం గ్రామ పంచాయతీ పరిధిలో యశోద ఆసుపత్రి (మలక్పేట) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ బైరు జగన్మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో గ్రామానికి చెందిన చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు సహా సుమారు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జనరల్ ఫిజీషియన్ డాక్టర్ జయశ్రీ, ఆర్థోపెడిక్ వైద్యురాలు డాక్టర్ ప్రతిభతో పాటు వైద్య సిబ్బంది మాధురి, మణి, వెంకటేష్ సేవలందించారు. శిబిరంలో భాగంగా రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), కంటి పరీక్షలతో పాటు ఎముకలు, కీళ్లకు సంబంధించిన ఆర్థోపెడిక్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ శిబిరం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామంలోనే వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించి, ఉచితంగా మందులు అందించడం పట్ల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్ కుమార్, వార్డు సభ్యులు సత్యనారాయణ, మధుకర్, రేవంత్, రాజశేఖర్, నవీన్, మమత, మహేందర్, లక్ష్మి, అంజయ్య, ప్రతాప్ రెడ్డి, విజయలక్ష్మి, కృష్ణ, గ్రామ కార్యదర్శి వెంకటయ్యతో పాటు గ్రామ పెద్దలు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.
