Wednesday, October 14, 2026
Homeతెలంగాణయాసంగిలో ఆరుతడి పంటల సాగుతో రైతులకు అధిక ఆదాయం

యాసంగిలో ఆరుతడి పంటల సాగుతో రైతులకు అధిక ఆదాయం

📰 Generate e-Paper Clip

  • మార్కెట్ డిమాండ్‌ ఉన్న పంటల వైపు రైతులు దృష్టి సారించాలి: ఉద్యాన శాఖ అధికారి జినుగు మరియన్న

గంగారం / మహబూబాబాద్, అక్టోబర్ 13(చైతన్యగళం):

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాసంగి సీజన్‌లో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న సూచించారు. బోర్లు, బావుల కింద అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులు ఏడాది పొడవునా ఆదాయం పొందవచ్చని తెలిపారు. మిషన్ వైవిధ్యంలో భాగంగా పంటల మార్పిడిని ప్రోత్సహిస్తూ, తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే పంటల సాగుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

ప్రతి మండలంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో పంటల వైవిధ్యాన్ని పెంచాలని సూచించారు. ఆయిల్‌పామ్‌, నిమ్మగడ్డి, కూరగాయలు, మల్బరీ, ఉల్లి, మునగ, పండ్లు, పూలు, నూనె గింజలు, అపరాలు, చిరుధాన్యాలు వంటి పంటలను సాగు చేయాలని తెలిపారు. వీటితోపాటు ఔషధ, సుగంధ తైల పంటలు, కొబ్బరి, కోకో, అవకాడో వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో బోర్లు, బావుల కింద సాధ్యమైన ప్రాంతాల్లో మార్కెట్ డిమాండ్‌ను బట్టి సుమారు 50 ఎకరాల్లో ఆదాయం అందించే పంటలను ప్రోత్సహించాలని వివరించారు.

సేంద్రియ పద్ధతులతో సాగు చేపట్టాలి

రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని మరియన్న సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా కూరగాయల సాగు, పందిర్ల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ప్రజలు రోజువారీగా వినియోగించే కూరగాయలను రైతులు తమ పొలాల గట్లపై, పొలం చుట్టూ, పెరటి తోటల్లో, డాబాలపై సాగు చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్‌, పండ్ల తోటల్లో అంతర పంటలుగా కూరగాయలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.

కూరగాయల సాగులో ప్రోట్రే పద్ధతిలో నారు పెంపకం, ఎత్తు మడుల ఏర్పాటు, మల్చింగ్‌, బిందు సేద్యం, ఫర్టిగేషన్‌ వంటి ఆధునిక పద్ధతులను అనుసరించాలని తెలిపారు. వేప పిండి, ఆముదం పిండి వినియోగం, వేప నూనె పిచికారీ, పసుపు రంగు అట్టల ఏర్పాటు వంటి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. సిఫారసు చేసిన ఎరువులను తగిన మోతాదులో వినియోగిస్తూ, పందిర్లపై కూరగాయల సాగు, ట్రెల్లిస్‌ పద్ధతిలో టమాటా సాగు వంటి ఆధునిక విధానాల ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని వివరించారు.

పంటల సాగుకు ముందు మార్కెట్ అవసరాలు, నీటి లభ్యత, నేల స్వభావాన్ని పరిశీలించి తగిన పంటలను ఎంపిక చేసుకోవాలని, పంటల మార్పిడిని పాటిస్తూ సాగు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు బి. వెంకటయ్య, యాదగిరి, విజయకుమార్‌, లింగస్వామి, ఉద్యాన శాఖ ఫీల్డ్ అధికారులు కిషోర్‌, రమేష్‌, విజయపాల్‌, అగస్టిన్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!