- అగ్రికల్చర్ బీఎస్సీ, వ్యవసాయ డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
- నెలకు రూ.15 వేల గౌరవ వేతనం.. అక్టోబర్ 15 చివరి తేదీ
మహబూబాబాద్(చైతన్యగళం): జిల్లాలో వానాకాలం 2026 ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో సన్న రకాల వడ్లను గుర్తించేందుకు సాంకేతిక నిపుణులను నియమించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో మొత్తం 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించగా, వీటిలో 199 కేంద్రాలను సన్న రకాల ధాన్యం కొనుగోలు కోసం కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌కు అర్హమైన సన్న రకాల వడ్లను కొనుగోలు కేంద్రాల్లో గుర్తించేందుకు ప్రతి కేంద్రంలో ఒక సాంకేతిక నిపుణుడిని నియమించనున్నారు.
వ్యవసాయంలో బీఎస్సీ లేదా వ్యవసాయ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎంపికైన వారికి రెండు నెలల పాటు నెలకు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు.
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ లేదా వ్యవసాయ డిప్లొమా సర్టిఫికెట్‌ను జతచేసి మహబూబాబాద్ కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 15, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.
మరిన్ని వివరాలకు 90594 74634 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
