- అక్టోబర్ 15న మహబూబాబాద్‌లో రిలే నిరాహార దీక్ష
మహబూబాబాద్(చైతన్యగళం): తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కట్లోజు పాండురంగ చారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళాకారుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 15న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా కమిటీ సమావేశం సోమవారం చెట్టబోయిన యాకన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పాండురంగ చారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగావకాశాలు కల్పించి, నెలకు రూ.50 వేల వేతనం అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విజ్ఞప్తి చేశారు.
ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వృద్ధ కళాకారులకు నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేయాలని, కళాకారులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన కళాకారులకు ఇంటి స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలంగాణ కళాకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు తమ సమస్యలు పరిష్కారం కాలేదని పాండురంగ చారి ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులకు న్యాయం జరిగే వరకు తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న చేపట్టనున్న రిలే నిరాహార దీక్షకు తెలంగాణ ఉద్యమ కళాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కేదాసు రమేష్‌తో పాటు పిడుగు రామమూర్తి, వీరన్న, ఎన్నమల్ల రవీందర్, అజ్మీరా వేణు, సుధాకర్, ఉపేందర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
