- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా పూల పండుగ సంబరాలు
మిర్యాలగూడ(చైతన్యగళం):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సుందర్‌నగర్ శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ రంగురంగుల పూలతో కళకళలాడగా, విద్యార్థుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది.

వేడుకల్లో భాగంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, తంగేడు, గునుగు, చామంతి, బంతి తదితర సహజసిద్ధమైన పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి పాఠశాలకు తీసుకొచ్చారు. వాటిని ఒకచోట అందంగా అమర్చి, చుట్టూ తిరుగుతూ ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ సంప్రదాయ గీతాలు ఆలపించారు. చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. విద్యార్థుల ఆటపాటలతో పాఠశాల ఆవరణ సందడిగా మారింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో పండుగల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు, మన సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకతను తెలియజేశాయి.
