కరీంనగర్, అక్టోబరు 7 (చైతన్యగళం): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం, మల్కాపూర్ గ్రామాల్లో పోలీసులు బుధవారం విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. రూరల్ ఏసీపీ విజయకుమార్ పర్యవేక్షణలో, కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు తనిఖీలు చేపట్టాయి.
గ్రామాల్లోని ప్రతి వీధిలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానితుల వివరాలను ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రజల భద్రత కోసమే తనిఖీలు నిర్వహిస్తున్నామని ఏసీపీ విజయకుమార్ తెలిపారు. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సైబర్ నేరాలు, మోసపూరిత లింకులు, అనుమానాస్పద ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేరాల నియంత్రణకు వీధులు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ హెచ్చరించారు.
కార్యక్రమంలో కొత్తపల్లి ఎస్సైలు, పోలీసు సిబ్బంది, ప్రత్యేక బలగాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
