- 20 నిమిషాలకు పైగా రోగి బంధువు చేతిలోనే ఐవీ..
నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలపై ప్రశ్నలు
నందికొట్కూరు, అక్టోబరు 7 (చైతన్యగళం): ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి కనీస చికిత్సా సౌకర్యాలు అందుబాటులో ఉండకూడదా? ఐవీ ద్రావణం ఎక్కించేందుకు అవసరమైన పరికరాలు లేక రోగి బంధువే బాటిల్‌ను చేతితో పట్టుకుని 20 నిమిషాలకు పైగా నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం కనిపించిన దృశ్యం ఈ ప్రశ్నలను లేవనెత్తుతోంది.రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి చికిత్స అందిస్తున్న సమయంలో ఐవీ ద్రావణం బాటిల్‌ను ఆసుపత్రి సిబ్బంది లేదా సహాయకుడు చేతితో పైకి ఎత్తి పట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. సుమారు 20 నిమిషాలకు పైగా ఇదే పరిస్థితి కొనసాగిందని రోగి బంధువులు తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచుతున్నామని ప్రభుత్వం చెబుతున్న వేళ.. నందికొట్కూరులో ఇలాంటి పరిస్థితి ఎందుకు కనిపించింది? ఐవీ బాటిల్ పెట్టేందుకు అవసరమైన సాధారణ పరికరాలు అందుబాటులో లేవా? ఉంటే వాటిని ఎందుకు వినియోగించలేదు? దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.
