అక్కన్నపేట, అక్టోబర్ 5 (చైతన్యగళం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అక్కన్నపేట మండలం పంతులు తండా ఎంపీపీఎస్ పాఠశాలలో సోమవారం గ్రామ సర్పంచ్ చిన్నా నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పాఠశాలలకు హాజరు శాతం పెంచి, చదువుపై ఏకాగ్రతను పెంపొందించడమే పథకం ఉద్దేశమని తెలిపారు.
పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన అల్పాహారం అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారం అందిస్తున్నందున గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
