- 32 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసిన ముగ్గురు.. 16 కిలోమీటర్ల విభాగంలో మరో ముగ్గురి ప్రతిభ
హుస్నాబాద్, అక్టోబర్ 4 (చైతన్యగళం): తెలంగాణ ఊటీగా పేరొందిన వికారాబాద్ అనంతగిరి కొండల్లో ఆదివారం నిర్వహించిన ‘అవంతిక అనంతగిరి హిల్స్ ట్రైల్ రన్–2026’లో హుస్నాబాద్‌కు చెందిన రన్నర్లు ప్రతిభ కనబరిచారు. కొండమీది హరి ప్రసాద్, బోయినీ పృథ్వీరాజ్, బత్తుల శ్రీను 32 కిలోమీటర్ల విభాగాన్ని పూర్తి చేశారు. ఇరుగు ఆశి, వొద్దిరాల శంకర్, ముద్దసాని యుగేందర్‌రెడ్డి 16 కిలోమీటర్ల పరుగును పూర్తి చేశారు.
దట్టమైన అడవులు, ఎత్తైన కొండమార్గాలు, సుమారు 600 మీటర్ల ఎత్తులోని చల్లని వాతావరణం రన్నర్లకు సవాల్‌గా నిలిచాయి. మూసీ నది జన్మస్థలమైన అనంతగిరి కొండల్లో ప్రకృతి మధ్య సాగిన ఈ పరుగు పోటీలో హుస్నాబాద్ రన్నర్లు సవాళ్లను అధిగమించి పతకాలు సాధించారు.
ప్రకృతి అందాలు, పచ్చని అడవులు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య నిర్వహించిన ఈ ట్రైల్ రన్ సాహసంతో పాటు మరపురాని అనుభూతిని అందించిందని రన్నర్లు తెలిపారు. ఆరోగ్యం, శారీరక దారుఢ్యంతో పాటు ప్రకృతిని ఆస్వాదిస్తూ పరుగును కొనసాగించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా చాటామని పేర్కొన్నారు.
