Saturday, October 3, 2026
Homeతెలంగాణకరీంనగర్22/ఏ భూముల సమస్యపై భూబాధితుల ఆందోళన..సీఎం పర్యటన నేపథ్యంలో జేఏసీ నాయకుల ముందస్తు అరెస్టులు

22/ఏ భూముల సమస్యపై భూబాధితుల ఆందోళన..సీఎం పర్యటన నేపథ్యంలో జేఏసీ నాయకుల ముందస్తు అరెస్టులు

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరీంనగర్‌ పర్యటన నేపథ్యంలో కొత్తపల్లి, రేకుర్తి, విద్యానగర్‌ ప్రాంతాలకు చెందిన భూబాధితుల జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తమ భూ సమస్యపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమైన తమను ఉదయం కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంపై జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్తపల్లి, రేకుర్తి, విద్యానగర్‌ ప్రాంతాలకు చెందిన సుమారు 800 ఎకరాల భూములు 22/ఏ నిషేధిత జాబితాలో ఉండటంతో దాదాపు 10 వేల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. ఇళ్లు, ప్లాట్లను విక్రయించలేక, కొత్తగా భూములు కొనుగోలు చేయలేక ఆర్థిక, మానసిక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పేర్కొన్నారు.

సమస్య పరిష్కారం కోసం గత ఏడాది కాలంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతులు అందిస్తున్నప్పటికీ అధికారులు కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎంపీ బండి సంజయ్‌లను కలిసి సమస్యను వివరించినట్లు తెలిపారు. ఇటీవల 22/ఏ భూముల విముక్తిపై ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ కరీంనగర్‌లోని తమ ప్రాంతాల భూముల ప్రస్తావన లేకపోవడంతో ఆందోళన మరింత పెరిగిందన్నారు.

జేఏసీ కన్వీనర్‌ పాశం మోహన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ ఎదుల్ల రాజశేఖర్‌, 19వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుదగోని మాధవికృష్ణ, రేకుర్తి మాజీ సర్పంచ్‌ నందేల్లి ప్రకాశ్‌, జేఏసీ ఉపాధ్యక్షుడు ఆకుల కృష్ణ, సైఫోద్దీన్‌ తదితరులను ముందస్తుగా అరెస్టు చేసినట్లు నాయకులు తెలిపారు. 22/ఏ జాబితా నుంచి భూములను తొలగించి, వేలాది కుటుంబాల సమస్యను పరిష్కరించాలని, హైకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేసి, ముఖ్యమంత్రి భూబాధితుల ప్రతినిధులతో చర్చించి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!