Tuesday, September 29, 2026
Homeతెలంగాణకరీంనగర్రేపు నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

రేపు నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం):

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

నూతన సమీకృత కలెక్టరేట్ భవనం వద్ద పూల అలంకరణ, పరిశుభ్రత, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్‌ను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. రేపు కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో ప్రత్యేక పూజల్లో పాల్గొని, కలెక్టర్‌ను వారి సీటులో ఆసీనులను చేసి అధికారికంగా విధుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా సమగ్ర అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్, అర్బన్ డెవలప్‌మెంట్ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించనున్నారు.

కరీంనగర్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. శాతవాహన యూనివర్సిటీలో గత పదేళ్లుగా వీసీ నియామకం కూడా జరగలేదని విమర్శించారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఫార్మసీ, ఇంజనీరింగ్ వంటి విద్యా అవకాశాలను పెంచడంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రేషన్ కార్డులు, సన్నబియ్యం, రైతు భరోసా, రైతులకు బోనస్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 70 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని, విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టళ్లలో డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని చెప్పారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ఎల్లంపల్లి, లోయర్ మానేరు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, గౌరవెల్లి, కలికోట సూరంపేట తదితర ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణకు రూ.250 కోట్లు కేటాయించామని, మిడ్ మానేరు ప్రాజెక్టు బాధితుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.

మానేరు రివర్‌ఫ్రంట్, డంపింగ్ యార్డ్, కరీంనగర్ రింగ్‌రోడ్డు తదితర కీలక అంశాలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిలో ఉన్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

కరీంనగర్ పర్యటన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వెళ్లనున్నారు. అక్కడ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర నిర్వహించి, అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. నేతన్నల సమస్యలు, పాత బకాయిల చెల్లింపుతో పాటు చేనేత, పవర్‌లూమ్ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించనున్నారని మంత్రి తెలిపారు. సీఎం పర్యటన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!