Sunday, September 27, 2026
Homeతెలంగాణఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేలా గ్రామస్థాయిలో కార్యాచరణ

ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేలా గ్రామస్థాయిలో కార్యాచరణ

📰 Generate e-Paper Clip

  • నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యం.. సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ

మహబూబాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): ఎల్నీనో ప్రభావం నేపథ్యంలో నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ పంటల సాగును ప్రోత్సహించాలని, భూగర్భ జలాల పెంపునకు గ్రామస్థాయిలో సమగ్ర చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ జాటోత్‌ రామచంద్రునాయక్‌ సూచించారు. వి.బి.జి. రామ్‌జీ పథకం, ఎల్నీనో పరిస్థితులపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శనివారం మహబూబాబాద్‌లోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రామచంద్రునాయక్‌ మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావంతో నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున రైతులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని అన్నారు. పంటల సాగులో నీటి వినియోగాన్ని తగ్గించే విధానాలను ప్రోత్సహించడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు అవసరమైన పనులను గ్రామస్థాయిలో చేపట్టాలని సూచించారు.

జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మాట్లాడుతూ గంగారం, కొత్తగూడ మండలాల్లో భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలని సూచించారు. వికసిత్‌ గ్రామ పంచాయతీ నిధులను స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించి పాడి పరిశ్రమ, వివిధ ఉపాధి యూనిట్లు, ఉద్యాన పంటలు, కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. జిల్లాకు అవసరమైన కూరగాయలు, పండ్లను స్థానికంగానే ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ, గ్రామీణాభివృద్ధి పనులను సమన్వయంతో చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పరస్పర సహకారంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. వి.బి.జి. రామ్‌జీ పథకం కింద భూగర్భ జలాల పెంపునకు దోహదపడే పనులను జిల్లావ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌, హౌసింగ్‌ పీడీ పురుషోత్తం, డీఆర్‌డీఓ ప్రాజెక్టు డైరెక్టర్‌ మధుసూదన్‌రాజు, జిల్లా వ్యవసాయ అధికారి రేవంత్‌, అదనపు డీఆర్‌డీఓ మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!