-
ఏడో వర్ధంతి సభలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్
హుస్నాబాద్, సెప్టెంబరు 24 (చైతన్యగళం): పేదలు, బడుగు వర్గాలకు న్యాయం జరిగే వరకు పోరాడిన గుంటిపెల్లి దుర్గేష్ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్ పిలుపునిచ్చారు. దుర్గేష్ ఏడో వర్ధంతిని పురస్కరించుకుని అనభేరి–సింగిరెడ్డి అమరుల భవనంలో సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం సంస్మరణ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తహసీల్దార్ కార్యాలయ ముట్టడి, కొత్తచెరువు శిఖం భూములు ఆక్రమణకు గురికాకుండా దుర్గేష్ చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. పేదలకు అన్యాయం జరిగిన ప్రతిచోటా అండగా నిలిచి, సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడిన ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.
హుస్నాబాద్‌లో రహదారి విస్తరణ సందర్భంగా తొలగించిన అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మల్లేశ్ ఆరోపించారు. మహనీయుల విగ్రహాలను గౌరవప్రదమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. తొలగించిన విగ్రహాలను వెంటనే పునఃప్రతిష్ఠించకపోతే నిరసనలు, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
దుర్గేష్‌తో పాటు పార్టీ కోసం పోరాడిన అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ, ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, సీపీఐ మండల నాయకులు రాజ్‌కుమార్, అయిలేని మల్లారెడ్డి, అక్బర్, వంగరాజు, అంకం శ్రీనివాస్, సాయికుమార్, దుర్గేష్ కుటుంబ సభ్యులు గుంటిపెల్లి అజయ్, గుంటిపెల్లి శైలజ, ముద్రకొల శ్యామల, ముద్రకొల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
