కరీంనగర్, సెప్టెంబర్ 18 (చైతన్యగళం):
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ శుక్రవారం పట్టణంలోని బాల సదన్, శిశుగృహాలను సందర్శించి పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించిన ఆయన కష్టపడి చదివి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.
బాల సదన్‌లోని సౌకర్యాలను పరిశీలించిన జడ్జి, అక్కడ అందుతున్న సౌకర్యాలు, పాటిస్తున్న పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు సౌకర్యాలను త్వరితగతిన మెరుగుపరచడంతో పాటు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. శిశుగృహంలోని పిల్లలకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వంటగది, ఆహార పదార్థాలను నిల్వ చేసే గదులను కూడా పరిశీలించారు.
బాల సదన్‌లో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రతపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కోరారు. ఎలాంటి న్యాయపరమైన లేదా న్యాయ సేవ అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి సరస్వతి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు కిరణ్ కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారి పర్వీన్, శిశుగృహ, బాల సదన్ నిర్వాహకులు పాల్గొన్నారు.
