- ఆరోగ్య పరిరక్షణలో ఫిజియోథెరపీ కీలకం
మహేశ్వరం, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మహబూబత్నగర్ గ్రామంలోని మాధవాంజీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో తుక్కుగూడ, కందుకూరు ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఫిజియోథెరపీ ప్రాధాన్యత, వ్యాయామం, శారీరక దృఢత్వం, పునరావాస చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గాయాలు, శారీరక వైకల్యాలు, వివిధ అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవడంలో ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. శారీరక చలనం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ సేవలు దోహదపడతాయని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు అర్హత కలిగిన ఫిజియోథెరపిస్టుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎండీ తరుణ్, ప్రిన్సిపాల్ మనోగ్న, డాక్టర్ పి.సి. హనుమంతరావు, అమర్నాథ్, డైరెక్టర్ హరిప్రసాద్, మహిపాల్, విమల హైమావతి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
