- ప్లాస్టిక్‌పై ప్రత్యేక డ్రైవ్.. గణేష్ ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు
- స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్, సెప్టెంబర్ 4(చైతన్యగళం): నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్ది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి, రెండు స్థానాల్లో నిలిపేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై జరిమానాలు విధించాలని, ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ పారిశుధ్య విభాగంపై సమీక్ష నిర్వహించారు. నగర పారిశుధ్యం మెరుగుదల, ప్లాస్టిక్ నివారణ, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పారిశుధ్య చర్యలు, ట్రేడ్ లైసెన్సులు, సోర్స్ లెవల్ సెగ్రిగేషన్, సీజనల్ వ్యాధుల నివారణ, డీఆర్‌సీసీల నిర్వహణ, వర్మికంపోస్టు, ప్రధాన బైపాస్ రహదారుల్లో పారిశుధ్య గ్యాంగ్ డ్రైవ్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
నగర పారిశుధ్యంలో సమూల మార్పులు తీసుకొచ్చేలా ఎస్సైలు, జవాన్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేయర్ సూచించారు. కార్పొరేటర్ల సమన్వయంతో డివిజన్లలో పరిశుభ్రత పనులు చేపట్టి ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. పారిశుధ్య విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డివిజన్లలో పారిశుధ్య పనులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సిబ్బంది కొరతను త్వరలోనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్లాస్టిక్‌పై ప్రత్యేక దృష్టి
ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మేయర్ ఆదేశించారు. ఫంక్షన్‌హాళ్లు, వ్యాపార సంస్థలు, దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై, నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వినియోగించే వారిపై జరిమానాలు విధించాలని తెలిపారు.
గణేష్ ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు
గణేష్ నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు పారిశుధ్య పనులు చేపట్టాలని మేయర్ సూచించారు. డివిజన్లలోని గణేష్ మండపాల వద్ద పారిశుధ్య ఏర్పాట్లు మెరుగ్గా చేయడంతో పాటు నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నివారణకు దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. ఎస్సైలు, జవాన్లు ప్రతిరోజూ తమ డివిజన్లలో పర్యటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయిలో ఉండాలి
కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ నగర పారిశుధ్య నిర్వహణలో పిన్ పాయింట్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఎస్సైలు, జవాన్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయిలో ఉండి పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది టీమ్ వర్క్‌తో పనిచేసి నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలన్నారు.
ఇంటింటి నుంచి చెత్తను సేకరించి నాలుగు రకాలుగా వేరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ ఎంతో కీలకమని, డివిజన్ల వారీగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
గార్బేజ్ పాయింట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి తడి చెత్తను వర్మికంపోస్టుకు, పొడి చెత్తను డీఆర్‌సీసీలకు, మిగిలిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. బల్క్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నగరంలోని ప్రధాన రహదారుల్లో ప్రతి వారం గ్యాంగ్ వర్క్ నిర్వహించాలని, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను సక్రమంగా చేపట్టాలని తెలిపారు. పారిశుధ్య విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆయాజ్, సువార్త, అదనపు కమిషనర్ రాజమనోహర్, ఏహెచ్‌ఓ సుమన్, వెటర్నరీ ఆఫీసర్ దుర్గా ప్రసాద్‌రెడ్డి, ఎంహెచ్‌ఓ సుమన్, సూపర్‌వైజర్ శ్యామ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
