Thursday, September 3, 2026
Homeతెలంగాణకరీంనగర్గంజాయి స్వాధీనం,ఒకరి అరెస్ట్

గంజాయి స్వాధీనం,ఒకరి అరెస్ట్

📰 Generate e-Paper Clip

కరీంనగర్ , సెప్టెంబర్‌ 3(చైతన్య గళం)

కరీంనగర్‌ రూరల్‌ మండలం ఇరుకుల్ల గ్రామ శివారులోని సమ్మక్క గద్దెల సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా.. మరో నిందితుడు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు పోలీసుల వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు కరీంనగర్‌ రూరల్‌ సీఐ అనుముల నిరంజన్‌రెడ్డి, ఎస్‌ఐ ఏ. లక్ష్మారెడ్డి సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఇరుకుల్ల గ్రామ శివారులో తనిఖీలు చేపట్టారు. సమ్మక్క గద్దెల సమీపంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌, బ్యాగుతో అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గమనించిన వారు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. సిబ్బంది వెంబడించి ఒకరిని పట్టుకున్నారు. మరో వ్యక్తి చెట్ల పొదల్లోకి వెళ్లి తప్పించుకున్నాడు పట్టుబడిన వ్యక్తిని విచారించగా.. అతను కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డుకు చెందిన బెజ్జంకి ప్రేమ్‌కుమార్‌ (28)గా గుర్తించారు. ఆటోమొబైల్‌ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. విచారణలో ఇరుకుల్ల గ్రామానికి చెందిన కాశిపాక నవీన్‌ (23)తో గత ఆరు నెలలుగా పరిచయం ఉందని, అతని ద్వారా గంజాయి సేవించే అలవాటు ఏర్పడిందని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు నవీన్‌ అప్పుడప్పుడు గంజాయిని తీసుకువచ్చి చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయించేవాడని, తనకు కూడా గంజాయి ఇచ్చేవాడని ప్రేమ్‌కుమార్‌ తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం నవీన్‌ కిలోకు పైగా గంజాయిని తీసుకువచ్చి, బుధవారం ఉదయం ఇరుకుల్ల శివారులోని సమ్మక్క గద్దెల సమీపానికి బైక్‌పై వచ్చాడని.. ఇద్దరూ కలిసి గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు వెల్లడించాడు పంచుల సమక్షంలో ప్రేమ్‌కుమార్‌ వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా.. ఒక నల్ల బ్యాగ్‌, ఒక తెల్ల కవర్‌ లభించాయి. తెల్ల కవర్‌లో గంజాయి ఉన్నట్లు గుర్తించి తూకం వేయగా 1 కిలో 11 గ్రాముల గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు. గంజాయితో పాటు బైక్‌, మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం ప్రక్రియను వీడియో, ఫొటోగ్రఫీ ద్వారా నమోదు చేశారు ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పోలీసులను చూసి పరారైన కాశిపాక నవీన్‌ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. నవీన్‌ను పట్టుకున్న అనంతరం గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు.. ఎవరి నుంచి సేకరించాడు.. ఎవరెవరికి విక్రయించాడు అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేయడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం, రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!