కరీంనగర్, ఆగస్టు 23 (చైతన్యగళం): సెంట్రింగ్ పనులు చేస్తూ అనారోగ్యానికి గురైన కూన ఆంజనేయులు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై కరీంనగర్ రూరల్ పోలీసులు ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఆరేపల్లి గ్రామానికి చెందిన కూన శైలజ ఫిర్యాదు మేరకు.. ఆమె భర్త ఆంజనేయులు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. ఈ నెల 19న కుటుంబ సభ్యులు అతడిని కొండగట్టుకు తీసుకెళ్లి తిరిగి తీసుకువచ్చారు. అదే రాత్రి ఫిట్స్ రావడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు సూర్య నర్సింగ్ హోమ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23న ఉదయం 6.59 గంటలకు మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మృతుడి శరీరంపై గాయాలు కనిపించడంతో అవి ప్రమాదవశాత్తు ఏర్పడ్డాయా.. ఎవరైనా దాడి చేయడం వల్ల సంభవించాయా.. అనారోగ్య కారణంగానే ఏర్పడ్డాయా అనే అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఏ. లక్ష్మారెడ్డి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఫిర్యాదుదారురాలి నుంచి దరఖాస్తు స్వీకరించారు. అనంతరం ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మృతికి అసలు కారణం తేల్చేందుకు వైద్య నివేదికలు, పోస్టుమార్టం నివేదిక, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ. నిరంజన్‌రెడ్డి తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మృతికి గల వాస్తవ కారణాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.
