కరీంనగర్, ఆగస్టు 15 (చైతన్యగళం): తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించి, సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో అంకితభావంతో సేవలందించడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేసిన కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ అనుముల నిరంజన్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన విశిష్ట పోలీస్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2025 సంవత్సరానికి ఇండియన్ పోలీస్ మెడల్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నిరంజన్‌రెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక పతకాన్ని అందుకున్నారు.
కానిస్టేబుల్‌గా ప్రస్థానం..
అనుముల నిరంజన్‌రెడ్డి 1989లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరారు. కరీంనగర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం 1990 జనవరిలో జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తొలి పోస్టింగ్ పొందారు. విధుల్లో చేరిన నాటి నుంచే తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ పలు ఎదురుకాల్పుల ఘటనల్లో విధులు నిర్వర్తించారు. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన అప్పటి కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రత్నారెడ్డి తక్కువ సర్వీస్ కాలంలోనే పదోన్నతి కల్పించారు.
మావోయిస్టుల కాల్పుల్లో గాయపడినా..
1992లో స్వగ్రామమైన వరంగల్ జిల్లాకు వెళ్తున్న సమయంలో సుమారు 20 మంది మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నిరంజన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనతో పాటు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శంకర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా మావోయిస్టులను ఎదుర్కొంటూ ఎదురు కాల్పులు జరిపి ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం కూడా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ఏమాత్రం భయపడకుండా విధులు కొనసాగించారు. ఆయన ధైర్యసాహసాలు, విశిష్ట సేవలను గుర్తించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సేవా పతకం, అనంతరం ముఖ్యమంత్రి ఉత్తమ సేవా పతకంతో సత్కరించింది.

ఎన్నికల సమయంలో కీలక సేవలు
1994 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిరిసిల్లలో విధులు నిర్వహిస్తున్న నిరంజన్‌రెడ్డి తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న వీర్నపల్లి గ్రామంలో సీఆర్పీఎఫ్తో ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపునకు గైడ్‌గా సేవలందించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కీలకంగా వ్యవహరించడంతో పాటు ఆ సమయంలో పలు బాంబులు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించారు.
విధి నిర్వహణలో భాగంగా ఎదుర్కొన్న ఎన్కౌంటర్ కేసులో సుదీర్ఘకాలం న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొన్నప్పటికీ అనంతరం నిర్దోషిగా బయటపడ్డారు. ఈ కారణంగా పదోన్నతుల్లో జాప్యం జరిగినా సర్వీస్ నిబంధనల ప్రకారం ఎస్ఐగా పదోన్నతి పొంది వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తించారు.
పోలీస్ విధులతో పాటు ప్రజాసేవ
2013లో గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో పోలీస్ విధులతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తూ మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులను ఒకచోట చేర్చి పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు.
మారుమూల గ్రామాల్లోని పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో భారీ వైద్య శిబిరాలను సైతం నిర్వహించారు. సుమారు 10 వేల మంది ప్రజలకు 50 నుంచి 70 మంది వైద్యుల సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందించారు. పోలీస్ శాఖలో కొత్తగా నియమితులయ్యే కానిస్టేబుల్ అభ్యర్థులకు ముందస్తు శిక్షణతో పాటు ప్రతిరోజూ గ్రౌండ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారిని శారీరకంగా, మానసికంగా సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
వివిధ పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వహించిన అనంతరం 2023లో సీఐగా పదోన్నతి పొందారు. విజిలెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో కొంతకాలం సేవలందించిన అనంతరం మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అక్కడ డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు కౌన్సెలింగ్, మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుని పలు కేసుల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న నిరంజన్‌రెడ్డి డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాలపై అవగాహన, సీసీటీఎన్ఎస్ తదితర పోలీస్ శాఖ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతూ పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారు.
సేవలకు దక్కిన గుర్తింపు
నిరంజన్‌రెడ్డి విశిష్టమైన, సుదీర్ఘమైన పోలీస్ సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు భారత ప్రభుత్వం 2025 సంవత్సరానికి ఇండియన్ పోలీస్ మెడల్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అనుముల నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఇండియన్ పోలీస్ మెడల్ రావడంలో ప్రజలు అందించిన సహకారం, ఉన్నతాధికారులు తన సేవలను గుర్తించి చేసిన సిఫారసులు ఎంతో కీలకమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు, తనతో కలిసి పనిచేసిన సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన పోలీస్ సేవా ప్రస్థానంలో తనతో కలిసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క సిబ్బంది సహకారాన్ని ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు.
ఇప్పటివరకు తన సేవలకు గుర్తింపుగా 82 క్యాష్ రివార్డులు, 64 జీఎస్సీలు, 24 ప్రశంసాపత్రాలు అందుకున్నట్లు నిరంజన్‌రెడ్డి తెలిపారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన తన పోలీస్ ప్రస్థానంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ప్రజా భద్రతకు అంకితమైన సేవలకు ఇండియన్ పోలీస్ మెడల్ లభించడం తనకు మరింత బాధ్యతను పెంచిందని ఆయన పేర్కొన్నారు.
